Telugu Gateway
Telangana

లోక్ సభ ఎన్నికల ముందు బిఆర్ఎస్ కు షాక్

లోక్ సభ ఎన్నికల ముందు బిఆర్ఎస్ కు షాక్
X

లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామం. ఢిల్లీ లిక్కర్ స్కాం లో తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. ఐదు గంటల పాటు ఇది సాగింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ కవిత తో పాటు ఆమె భర్త, కవిత సిబ్బంది దగ్గర ఉన్న అన్ని ఫోన్లను సీజ్ చేశారు. లిక్కర్ స్కాం లో కవిత అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే పెద్ద ఎత్తున హడావుడి జరిగింది. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఇదే విషయంపై పలు మార్లు బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. ఈ ప్రకటనలు అప్పటిలో బీజేపీ కి రాజకీయంగా పెద్ద ఎత్తున నష్టం చేశాయనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ, బిఆర్ఎస్ లు ఒకటే అని..అందుకే లిక్కర్ స్కాం విషయంలో ఎంతో మందిని అరెస్ట్ చేసినా కూడా కవిత పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ అప్పటిలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసు లో కవిత కు ఈడీ , సిబిఐ లు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్ట్ లో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో ఎలాంటి కఠిన చర్యలు ఉండకపోవచ్చు అంటూ భావిస్తూ వచ్చారు.

కానీ ఎవరూ ఊహించని రీతిలో ఈడీ కవితను అదుపులోకి తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్ సభ ఎన్నికల ముందు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఈ సారి కెసిఆర్ కుమార్తె కవిత విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది అనే చర్చ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలక పాత్రధారులు ఇప్పటికే అప్రూవర్ లుగా మారి కవిత కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ సమాచారం ఆధారంగానే ఇప్పుడు ఈడీ కవితను అరెస్ట్ చేసినట్లు చెపుతున్నారు. సుప్రీం కోర్ట్ కు ఇచ్చిన అండర్ టేకింగ్ ను తుంగలో తొక్కి కవిత ను అరెస్ట్ చేయటం సరికాదు అంటూ బిఆర్ఎస్ కు లీగల్ టీం కు చెందిన సోమా భరత్ అభిప్రాయపడ్డారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తామని అయన వెల్లడించారు. కవిత అరెస్ట్ విషయం నిర్దారణ కావటంతో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు కవిత నివాసానికి చేరుకున్నారు.

Next Story
Share it