Telugu Gateway
Telangana

పార్టీలతో బంధమే.. ‘మెఘా’ మేనేజ్‌మెంట్ స్కిల్ !

పార్టీలతో బంధమే.. ‘మెఘా’ మేనేజ్‌మెంట్ స్కిల్ !
X

దేశంలో దిగ్గజ పారిశ్రామిక సంస్థలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ, టాటా గ్రూప్ కంపెనీలు. కానీ ఆ కంపెనీల పేర్లు ఒక్కటి కూడా తాజాగా బయటకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ జాబితాలో లేక పోవటం విశేషం. అయితే గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీలు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు ఎంత దగ్గరో అందరికి తెలిసిందే. ముఖ్యంగా గౌతమ్ అదానీ విషయంలో పెద్ద దుమారమే చెలరేగింది. అయినా సరే ఎన్నికల బాండ్ల జాబితాలో ఈ దిగ్గజ కంపెనీల పేర్లు ఏమి లేకపోవటం హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి. ఎన్నికల బాండ్స్ దగ్గరకు వచ్చేసరికి హైదరాబాద్ కేంద్రంగా పని చేసే మెఘా ఇంజనీరింగ్ ఏకంగా దేశంలోనే రెండవ స్థానంలో నిలవటం విశేషం. ఈ కంపెనీ దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయల మేర నిధులను ఎన్నికల బాండ్స్ ద్వారా దేశంలోని వివిధ పార్టీలకు విరాళాలుగా అందించింది. ఫస్ట్ ప్లేస్ లో ఫ్యూచర్ గేమింగ్ అనే పెద్దగా ఎవరికీ తెలియని కంపెనీ ఉంటే...తర్వాత స్థానంలో మెఘా ఇంజనీరింగ్ నిలిచింది. ఈ కంపెనీ ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ దక్కించుకున్నా కూడా భారీ ఎత్తున అంచనాలు పెంచి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుంది అనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో కంపెనీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుపెడితే..ఇప్పుడు చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్...తెలంగాణ లో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కథలకు అయితే అంతే లేదు.

కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని కొన్ని ప్యాకేజీల్లోనే ఐదు వేల కోట్ల రూపాయల వరకు మెఘాకు అనుచిత లబ్ది కలిగినట్లు కొద్ది రోజుల క్రితమే కాగ్ నిగ్గుతేల్చింది. మొత్తం ప్యాకేజీ ల విషయాలు బయటకు వస్తే ఈ లెక్క ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల బాండ్స్ అంటే అధికారిక లంచాలు వంటిని అని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. మెగా ఇంజనీరింగ్ ఎన్నికల బాండ్స్ ద్వారానే ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మేర రాజకీయ పార్టీలకు అందచేసింది. ఇక తెరవెనక ఇచ్చే అవినీతి సొమ్ము ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక పని చేపట్టాలంటే దీనికి చాలా ముందు నుంచే కంపెనీ అంతా డిజైన్ చేస్తుంది అని...దాని ప్రకారమే ప్రభుత్వాలు..అధికారులు కూడా మెఘా ఇంజనీరింగ్ కు సహకరించిన సందర్భాలు ఎన్నో అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంటే ప్రాజెక్ట్ ల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటూ వీటినే పార్టీలకు..అధికారికంగా..అనధికారికంగా ముట్టచెపుతూ మెఘా ఇంజనీరింగ్ అతి తక్కువ సమయంలో ఈ స్థాయి కి చేరింది అని చెపుతున్నారు. తెలంగాణాలో రాజకీయంగా పెద్ద దుమారం రేపిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఇంత కాలం చూసీ చూడనట్లు వదిలేయడానికి కంపెనీ అధికారికంగా , అనధికారికంగా ఇచ్చిన నిధులే అనే చర్చ కూడా రాజకీయ, అధికార వర్గాల్లో ఉంది. మొత్తానికి ఎన్నికల బాండ్స్ విషయం ద్వారా మరో సారి మెఘా విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి.

Next Story
Share it