Telugu Gateway
Telugugateway Exclusives

అడ్డంకులు అధిగమించి ఎదిగిన రేవంత్ రెడ్డి

అడ్డంకులు అధిగమించి ఎదిగిన రేవంత్ రెడ్డి
X

టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకే ఇవ్వాలి. రేవంత్ రెడ్డి కి ఈ బాధ్యతలు అప్పగించినప్పుడు కొంతమంది నాయకులు లేవనెత్తిన వాదన ఇది. బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు కీలక పదవులు ఇవ్వటం సరికాదు అంటూ చాలా మంది నేతలు అప్పట్లో విమర్శలు చేశారు. ఇదే కారణాన్ని చూపుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీ లో చేరి...ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోగొట్టుకుని...మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కలు కూడా అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్లే. ఒరిజినల్ కాంగ్రెస్ వాదులుగా చెప్పుకున్న మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమకుమార్ రెడ్డి చేయలేని పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసి చూపించారు. బిఆర్ఎస్ ను, కెసిఆర్ ను తెలంగాణాలో ఓడించటం అంత ఈజీ కాదు అనే అభిప్రాయం ఉన్న వేళ ఆయన ఈ పని చేసి చూపించారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం తీసుకున్న తర్వాత తొలి టీపీసీసీ పదవి పొన్నాల కే దక్కింది. వాస్తవానికి రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలోకి రావటానికి అది అద్భుత అవకాశం. కానీ అప్పట్లో పొన్నాల తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తర్వాత టీపీసీసీ పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి దక్కింది. ఆయన కూడా పార్టీ ని అధికారంలోకి తీసుకురావటంలో విఫలం అయ్యారు. ఉత్తమ్ ను కెసిఆర్ హౌసింగ్ స్కాం పేరు చెప్పి భయపెట్టి చెప్పు చేతల్లో పెట్టుకున్నారనే విమర్శలు అప్పటిలో కొంత మంది కాంగ్రెస్ నేతలే చేశారు.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే తొలి టర్మ్ పూర్తి చేసున్న కెసిఆర్ ...రెండవ సారి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ వై ఎస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల హౌసింగ్ స్కాం కు పాల్పడ్డారు అని..ఆయనపై ఈ సారి చర్యలు తప్పవంటూ బహిరంగంగానే ప్రకటించారు. కానీ కెసిఆర్ రెండవ టర్మ్ అయిపొయింది...మూడవసారి ఓడిపోయి ఇంటికి పోయారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఇప్పటికి ఎలాంటి చర్యలు లేవు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే సాగింది అనే విమర్శలు లేకపోలేదు. కారణాలు ఏమి అయినా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాదులుగా చెప్పుకునే పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయలేని పని బయట నుంచి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు. తెలంగాణ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాడు. ఆయనకు ఎన్నో అంశాలు కలిసివచ్చి ఉండొచ్చు కానీ...ఈ గెలుపులో రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్..కృషిని ఎవరూ కాదనలేని వాస్తవం. మరో వైపు తెలంగాణలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు రాజకీయ ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి మాత్రమే అనే స్థాయికి ఎదిగాడు.ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సర్వేలు...అభిప్రాయ సేకరణలో కూడా సీఎం కెసిఆర్ తర్వాత రెండవ స్థానంలో నిలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి అనే విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రాష్ట్ర మంతటా పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేశారు. పొన్నాల కొద్ది రోజుల కిందటే కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లో చేరగా..ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.

Next Story
Share it